
మేడారం వేదికగా రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు…!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కాబోతోంది. హైదరాబాద్ వెలుపల మంత్రివర్గం సమావేశం కావడం ఇదే తొలిసారి. సమ్మక్క- సారలమ్మ గద్దెల సమీపంలో ఉన్న హరిత హోటల్ దీనికి వేదిక.
సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ అవుతుంది. అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం తెల్లవారు జామున అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ ఉదయం పాలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం ఖమ్మంలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులను కలుసుకుంటారు. అనంతరం సీపీఐ వందేళ్ల సభలో పాల్గొననున్నారు.
అనంతరం ప్రత్యేక హెలీకాప్టర్ లో ఖమ్మం నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకు మేడారానికి చేరుకుంటారు. అదే సమయంలో జిల్లా పర్యటనల్లో ఉన్న మంత్రులు కూడా మేడారానికి చేరుకుంటారు.
మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 251 కోట్ల రూపాయల భారీ మౌలిక సదుపాయాల పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఈ మంత్రివర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఇందులో- గద్దెల విస్తరణకు 101 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ నెలలో జరగనున్న జాతరకు అంచనా వేసిన రికార్డుస్థాయి భక్తుల కోసం పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రవాణా సౌకర్యాల ఏర్పాట్లను కూడా కేబినెట్ సమీక్షిస్తుంది.
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ హోదా కల్పించాలన్న తమ దీర్ఘకాల డిమాండ్‌పై ఓ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. వీటితో పాటు మంత్రివర్గం పలు ఇతర కీలక అంశాలపై చర్చిస్తుంది.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, ఇటీవల చోటుచేసుకున్న న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో ఏపీతో నదీ జలాల వివాదాలపై అనుసరించిన వ్యూహాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
పట్టణ స్థానిక సంస్థలకు బీసీ రిజర్వేషన్లకు ఆమోదం, 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కోసం బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలు అజెండాలో ఉన్నాయి.
అలాగే రైతు భరోసా చెల్లింపులు, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన, ఇతర సమకాలీన రాజకీయ అంశాలపై కేబినెట్ లో చర్చకు రానున్నట్లు సమాచారం.
రబీ సీజన్‌లో పంట సాగును ధ్రువీకరించడానికి కు ఉపగ్రహ మ్యాపింగ్, ఇతర అధునాతన సాంకేతిక పద్ధతులను అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది.
రైతు భరోసా పథకం కింద అందించే ఆర్థిక సాయం నిజమైన రైతులు, సాగులో ఉన్న భూములకు మాత్రమే అందేలా చూసేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉపగ్రహాల ద్వారా సేకరించిన సాగు వివరాల డేటా ప్రభుత్వానికి అందిన తర్వాత, దానిని క్షుణ్ణంగా విశ్లేషించి మాత్రమే నిధులు విడుదల కానున్నాయి.
వ్యవసాయ శాఖ అధికారులు ఉపగ్రహ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, సాగు భూములపై ఓ సమగ్ర నివేదికను సమర్పించాలని గతంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.



