
భట్టి పై అసత్య రాతలు తగవు
ఖమ్మం డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ హితవు
40 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితంపై విమర్శలా?
బీజేపీని బలపర్చేందుకే మంత్రివర్గంలో చిచ్చుకు యత్నం
బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఖమ్మం డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ డిమాండ్
సి కె న్యూస్ ప్రతినిధి
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై ఏబీఎన్ రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’లో రాసిన రాతలు సత్య దూరంగా ఉన్నాయని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని ప్రజా నాయకులపై బురద చల్లడం తగదని హెచ్చరించారు.
గాంధీ కుటుంబం ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన భట్టి విక్రమార్క, గత 40 ఏళ్లుగా సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని నూతి సత్యనారాయణ గౌడ్ గుర్తు చేశారు. “దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా తెలంగాణ ఏర్పాటులో భట్టి కీలక పాత్ర పోషించారు.
మచ్చలేని రాజకీయ చరిత్ర కలిగిన అటువంటి నాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీని తెలంగాణలో బలపరచాలనే దురుద్దేశంతోనే ఏబీఎన్ ఇటువంటి అసత్య కథనాలు రాస్తున్నదని అర్థమవుతుందన్నారు.
కావాలని రాష్ట్ర మంత్రివర్గంలో అభిప్రాయ భేదాలు సృష్టించి, ప్రభుత్వంపై అస్థిరత కల్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత గాథలు రాయడం తెలంగాణ సమాజాన్ని కించపరచడమేనన్నారు.
భట్టి విక్రమార్క మల్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య భావజాలం కలిగిన వ్యక్తి అని, ఉప ముఖ్యమంత్రి గా,ఆర్థిక శాఖా మాత్యులుగా, ఇంధన శాఖా మాత్యులుగా బాధ్యతో నిర్వహిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి ఉద్యోగులకు 01 వ తారీఖున జీతాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర జి డీ పి అభివృద్ధిని పెంచుకుంటూ వస్తున్నారని,తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు రుణమాఫీ,మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అనేక విధాలుగా మహిళలకు బ్యాంకు రుణాలు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమపదకాలను ప్రవేశ పెడుతున్నారని,
బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని అనేక ఇంటిగ్రేటెడ్ స్కూల్ లు, వైద్యాభివృద్ధికి 100 పడకల ఆస్పత్రులు నిర్మిస్తున్నారని, అటువంటి నిస్వార్థ నేతపై అసత్య ఆరోపణలు రాయడం సూర్యునిపై ఉమ్మి వేసిన చందంగా ఉన్నదని అన్నారు.
“గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీ పత్రికను నిషేధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడింది. ఈ రోజు అదే పార్టీకి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ చానల్ కు, ఇతర మీడియా సంస్థలకు ఉన్న వ్యక్తిగత తగాదాలను కాంగ్రెస్ పార్టీకి అంట కట్టడం సరికాదన్నారు.
తెలంగాణ సమాజం హర్షించని విధంగా, కేవలం మీ అనుకూల వ్యక్తులను బలపరిచేందుకు రాసే రాతలను కాంగ్రెస్ కార్యకర్తలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఇకనైనా అవాస్తవాలు రాయడం మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు.
నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి ఖమ్మం పర్యటనను విజయంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు,శ్రేణులు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.



