
గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వీటీజీ–సెట్ 2026 అప్లికేషన్ గడువు పొడిగింపు
సి.కే న్యూస్ ప్రతినిధి నరసింహ ఏన్కూరు జనవరి 22 2026:రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు నిర్వహించనున్న వీటీజీ – సెట్ 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ గడువును పొడిగించినట్లు ఏన్కూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేము రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ లోగా తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే అప్లికేషన్ నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఉన్న పొరపాట్లను సవరించుకునేందుకు కూడా ఈ నెల 25వ తేదీనే చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు.
గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్య, వసతి, భోజనం, శిక్షణ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో విద్యార్థులకు ఇది మంచి అవకాశమని ప్రిన్సిపాల్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని, సందేహాల నివృత్తి కోసం సమీప గురుకుల పాఠశాలలను సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ వేము రాజు సూచించారు.




