
మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి కీలక ముందడుగు…
మార్కెట్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
మత్కేపల్లి గ్రామంలో ఆధునిక సౌకర్యాలతో వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చింతకాని మరియు ముదిగొండ మండలాలకు సంబంధించి నూతన వ్యవసాయ మార్కెట్ నిర్మాణం కొరకు చర్యలు చేపట్టడం జరిగింది.
గతంలో మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం 8 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, ఇటీవల ఎజిలిటీ (Agility) కంపెనీ ప్రతినిధులు మార్కెట్ కమిటీ స్థలాన్ని పరిశీలించిన అనంతరం, ఆధునిక మార్కెట్ నిర్మాణానికి కనీసం 15 ఎకరాల స్థలం అవసరం అని సూచించారు. ఈ విషయాన్ని గమనించిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ అంబటి వెంకటేశ్వరరావు , అదనంగా మరో 7 ఎకరాల భూమి కేటాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు కి విన్నపం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సానుకూల స్పందనతో, వారి ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, చింతకాని మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) మత్కేపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 41లోని, వ్యవసాయానికి అనువుగా లేని ప్రభుత్వ భూమిలో మొత్తం 15 ఎకరాలు వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది.
ఈ నిర్ణయంతో మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి బలమైన పునాది పడింది. ఆధునిక వసతులతో కూడిన మార్కెట్ ఏర్పడితే, చింతకాని, ముదిగొండ మండలాలతో పాటు పరిసర గ్రామాల రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు, రవాణా ఖర్చులు తగ్గి ఆర్థికంగా లాభపడే అవకాశం ఏర్పడుతుంది.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొని, మార్కెట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు కి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు కి, జిల్లా యంత్రాంగానికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కి మరియు అధికారులకు రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ – రైతుల ఆశల ప్రతీకగా నిలవబోతోంది



