BhadrachalamPoliticalTelangana

మార్కోడు ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మార్కోడు ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మార్కోడు ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, (సాయి కౌశిక్),

జనవరి 22,

మార్కోడు గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ తదితర మౌలిక వసతులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.

మరుగుదొడ్ల పరిశీలన సమయంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, తక్షణమే చర్యలు తీసుకొని నిరంతర నీటి సరఫరా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో పాఠశాల భవనంలో లికేజీ సమస్య ఉన్నట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, అవసరమైన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

డైనింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లు, వంట నిర్వహణ విధానాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు శుభ్రమైన, పోషకాహారంతో కూడిన రుచికరమైన భోజనం తప్పనిసరిగా అందించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పాఠశాల లో కిచెన్ షెడ్ నిర్మాణానికి అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వంటకట్టెల పై ఆధారపడుతున్న పరిస్థితిని గమనించిన కలెక్టర్, గ్యాస్ సరఫరా ఏర్పాట్లకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

అనంతరం మూడవ, ఆరవ, ఎనిమిదవ తరగతుల గదులను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.

విద్యను అభ్యసించడంలో శ్రద్ధ చూపాలని, జీవిత లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమయాన్ని వృథా చేయకుండా చదువుపై పూర్తి దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థుల చదవడం, రాయడం నైపుణ్యాలను పరిశీలిస్తూ బోర్డుపై రాయించి, పుస్తకాలు చదివించి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షిత వాతావరణంతో పాటు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పోషకాహారం తప్పనిసరిగా అందాలని తెలిపారు. పాఠశాలల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని, చిన్న లోపం కూడా విద్యార్థుల ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు.

మరుగుదొడ్లు, నీటి సరఫరా, హాస్టల్ వసతులు ఎల్లప్పుడూ సక్రమంగా ఉండేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం మార్కోడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న కొత్త తరగతి గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి, పది రోజుల్లోగా అన్ని పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా చేపడుతున్న నిర్మాణాలకు అవసరమైన విద్యుతీకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు ముత్తయ్య, రామకృష్ణ, బోధన, బోధనీ తర సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button