
భర్త కోసం విషం తాగిన భార్య… కాపురానికి రావడం లేదంటూ
అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కాపురానికి రాలేదని బాధితురాలు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ఆత్మహత్యకు యత్నించారు.
మండల పరిధిలోని వీర ఓబనపల్లికి చెందిన మనీష, అదే గ్రామానికి చెందిన మహేందర్రెడ్డి నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. బెంగుళూరులో మూడు నెలలపాటు కాపురం చేశారు. ఆ తరువాత స్వగ్రామానికి వచ్చిన మహేందర్ రెడ్డి, కాపురానికి వెళ్ళకుండా ముఖం చాటేశాడు.
దీంతో భర్త కోసం మనీషా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరికీ గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు. బయటికి వెళ్లి చర్చించుకుని రావాలని సూచించి, పంపించారు.
ఇద్దరూ మాట్లాడుకునే సమయంతో తాను కాపురానికి వచ్చేది లేదని మహేందర్ రెడ్డి ఖరాకండిగా చెప్పడంతో మనస్తాపం చెందిన మనీషా, తనతో తెచ్చుకున్న పురుగల మందును తాగేసింది. గమనించిన బంధువులు, పోలీసులు వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. పోలీసులు న్యాయం చేయకపోవడంవల్లే తన కూతురు ఆత్మహత్యకు యత్నించిందని మనీషా తల్లి సునీత ఆరోపించారు.



