
గెలుపు గుర్రాలకే బీఆర్ఎస్ కౌన్సిలర్ టికెట్లు : మాజీ మంత్రి పువ్వాడ
త్వరలో జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సర్వేల ఆధారంగా కౌన్సిలర్ల టిక్కెట్లను గెలుపు గుర్రాలకే కేటాయిస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
వైరాలోని శాస్త్రనగర్ లో ఉన్న మిట్టపల్లి గార్డెన్స్ లో శుక్రవారం వైరా మున్సిపాలిటీ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి అధ్యక్షతన జరిగిన సభలో పువ్వాడ ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ను కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
2018 ఎన్నికల్లో నియోజకవర్గంలో మదన్ లాల్ గెలిచి బీఆర్ఎస్ ఖాతాలో వైరా పడాల్సి ఉందన్నారు. ఎన్నికల్లో మదన్ లాల్ తో పాటు పార్టీ తలరాతలను మార్చింది పార్టీ ద్రోహులే అని విమర్శించారు.
ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన హయాంలో ఖమ్మంకు దీటుగా వైరా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. త్వరలో జరిగే వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని రావాలని నాయకులు కార్యకర్తలను కోరారు.
వైరా మున్సిపాలిటీ పై మళ్లీ గులాబీ జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లలో ఏడుగురు బీఆర్ఎస్ తో మిగిలారని పేర్కొన్నారు. వారికి టికెట్లు కేటాయించేందుకు స్థానిక నాయకులు కృషి చేయాలని సూచించారు.
ఈనెల 25వ తేదీన ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల అయ్యేంతవరకు తాను అండగా ఉండి ఇక్కడే తిష్టవేసి పని చేస్తామని స్పష్టం చేశారు.
ఈనెల 27వ తేదీ నుంచి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ప్రారంభించటంతో పాటు బాకీ కార్డులను వైరా మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని సూచించారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని తానే ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపునకు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ఇక్కడే ఉండి పనిచేయాలని సూచించారు. ఖమ్మం నియోజకవర్గం నాయకులను కూడా తాను తీసుకువచ్చి నిరంతరం ఇక్కడే ఉండి పార్టీ గెలుపునకి కృషి చేస్తానన్నారు.
వైరా నియోజకవర్గంలో ప్రజలకు తాను అండగా నిలబడతానని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తాను ఇక్కడే ఉండి పనిచేస్తానని పేర్కొన్నారు. గడిచిన 25 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు.
కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్, ఫోన్ టాపింగ్ తదితర అంశాల పై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టిస్తుందన్నారు. 6 గ్యారంటీల అమలు చేయాలని ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీష్ రావులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బానోత్ మంజుల, లకావత్ గిరిబాబు, బానోత్ చంద్రావతి, ఆర్జేసి కృష్ణ పగడాల నాగరాజు, బచ్చు విజయకుమార్, వెల్లంకి సత్యనారాయణ, కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, కొత్తా వెంకటేశ్వరరావు, పోట్ల శ్రీనివాసరావు, మాదినేని సునీత తదితరులు పాల్గొన్నారు.



