
మున్సిపల్ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా పనిచేయాలి…
- పార్టీ గెలుపే పరమావధిగా అందరూ సమన్వయంతో సాగాలి
- సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- ఇల్లందు నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం
ఖమ్మం : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మున్సిపల్ ముఖ్య నేతలు, ఆశావహులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
త్వరలోనే ఎన్నికల నగారా
ఎన్నికల ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. “వచ్చే నెల మధ్య నాటికి ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పుడే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక
టికెట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి వార్డులో ప్రజల ఆమోదం, అభ్యర్థి యోగ్యత ఆధారంగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించి, ఆ నివేదికల ప్రకారమే బి-ఫామ్ ఇస్తామని వెల్లడించారు.
పార్టీ పట్ల విధేయత, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా అర్హులకే సీట్లు దక్కుతాయని భరోసా ఇచ్చారు.
క్రమశిక్షణే ముఖ్యం.. అందరికీ సముచిత స్థానం
పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి కోరారు. “ఒకే వార్డులో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం సహజం. కానీ బి-ఫామ్ ఒకరికే దక్కుతుంది. టికెట్ రాని మిత్రులు ఆందోళన చెందవద్దు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ గుర్తించి, భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా ప్రభుత్వంలోని ఇతర పదవుల ద్వారా వారి రాజకీయ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాదే” అని హామీ ఇచ్చారు. పార్టీ లైన్ దాటకుండా, ప్రతి ఒక్కరూ అధికారిక అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధికి నిధుల వెల్లువ
“ఇల్లందు అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను కేటాయించాం.
మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో మన అభ్యర్థులను గెలిపిస్తే, భవిష్యత్తులో మరింత భారీగా నిధులు తీసుకువచ్చి ఇల్లందు రూపురేఖలు మారుస్తా” అని మంత్రి వాగ్దానం చేశారు.
తనను నమ్ముకున్న కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా కాపాడుకుంటానని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.




