
మేమిద్దరం కలిస్తే బీఆర్ఎస్ పని ఖతమే.. MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు.అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిస్తే బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీలో అయినా గ్రూపు రాజకీయాలు, విభేదాలు సర్వసాధారణం అని అన్నారు. బీఆర్ఎస్లో కుటుంబ గొడవ, కాంగ్రెస్లో మంత్రుల కొట్లాటలు చూస్తూనే ఉన్నామని తెలిపారు.
అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కోసం ఇన్చార్జులను ఎప్పుడో రంగంలోకి దించామని అన్నారు. రేపో మాపో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లలో తమకు కాంగ్రెస్తోనే పోటీ అని.. బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ : మరోవైపు తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది.
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్ఈసీ రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే దఫాలో ఒకే రోజున ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని, రీ పోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతోపాటే ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు.




