
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
హైదరాబాద్ : మితిమీరిన వేగం ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణం తీసింది. నగరంలోని బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఓ కారు అదుపు తప్పి పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. ఐటీ పోచారం వెళ్తున్న ఓ కారు.. బోడుప్పల్ వద్ద పిల్లర్ 97ను బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడినవాళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను, క్షతగాత్రులను వనపర్తికి చెందిన బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు.
ఘటన సమయంలో కారులో ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.



