
హైదరాబాద్ లో నకిలీ వైద్యుడి నిర్వాకం.. నురగలు కక్కుకొని చనిపోయిన పేషెంట్
Web desc : హైదరాబాద్ లో నకిలీ వైద్యుడి నిర్వాకం, నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జ్వరం వచ్చిందని వచ్చిన పేషెంట్ కు ఏం ఇంజెక్షన్ ఇచ్చాడో గానీ.. కాసేపటికే నురగలు కక్కుకుని చనిపోవడం కలకలం రేపింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఫిర్జాదిగూఢలో బుధవారం (జనవరి 29) రాత్రి జరిగింది ఈ ఘటన. పీర్జాదిగూడలో ఉంటున్న పి.ఎల్లం (56) అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతుండగా.. ఆర్ఎంపీ వైద్యుడు లునావత్ రూప్ సింగ్ దగ్గరకు తీసుకెళ్లింది అతని భార్య.
వైద్య పరీక్షల అనంతరం రెండు ఇంజెక్షన్ లు ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఎల్లం నోట్లో నుంచి నురగ రావడంతో.. అతని భార్య భయాందోళనకు గురైంది. వెంటనే తన కుమారునికి సమాచారం ఇచ్చింది.
కుమారుడు వచ్చిన వెంటనే బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో పేషెంట్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
దీంతో మృతుడి కుమారుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చే చేశారు.
రూప్ సింగ్ డాక్టర్ చదివినట్లు ఎలాంటి అర్హత పత్రాలు లేవని తేలింది. ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు తేలడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.



