
కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు.. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత ఫైర్
ఫోన్ ట్యాపింగ్ పేరుతో గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులు ‘అలీబాబా 40 దొంగలు’, ‘దండుపాళ్యం ముఠా’ తరహాలో అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
బొగ్గు స్కామ్, 9 వేల ఎకరాల భూమి స్కామ్ తదితర అవకతవకలు జరుగుతున్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి సిట్ పేరిట కుట్రలు జరుగుతున్నాయని ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా ట్యాపింగ్ చేయమని చెప్పరని తెలిపారు.
విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకు లీకులు ఇస్తున్నారని, మహానేత కేసీఆర్‌ను వేధించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు.
14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తేవడమే కేసీఆర్ చేసిన నేరమా అని ప్రశ్నించారు. కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
హరీశ్ రావు ఎన్నికల అఫిడవిట్‌లో సిద్దిపేట అడ్రస్ ఇచ్చినా హైదరాబాద్ ఇంటికి నోటీసు ఇచ్చారని, కేసీఆర్‌కు మాత్రం హైదరాబాద్‌లోనే ఇచ్చారని తెలిపారు.
రేవంత్ రెడ్డి అడ్రస్ కొడంగల్ అయినా గతంలో అధికారులు హైదరాబాద్‌లో నోటీసులు ఇచ్చారని.. కేసీఆర్‌పై మాత్రం వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు తెలంగాణ ప్రజలు తప్పకుండా శిక్ష వేస్తారని బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.



