
కోటి షూటౌట్ కేసుపై నగర సీపీ సజ్జనార్ ఆసక్తికరమైన పోస్ట్
హైదరాబాద్ నడిబొడ్డు అయిన కోటిలో శనివారం ఉదయం జరిగిన దోపిడీ ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. కేరళకు చెందిన వస్త్ర వ్యాపారి రిన్షాద్ తన వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును డిపాజిట్ చేసేందుకు బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లగా, ఇద్దరు దుండగులు అతనిపై దాడి చేశారు.
తుపాకీతో బెదిరించి నగదు సంచిని లాక్కోవడానికి ప్రయత్నించగా, రిన్షాద్ ప్రతిఘటించారు. ఈ క్రమంలో నిందితులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ బాధితుడి కుడి కాలులోకి దూసుకెళ్లింది.

అనంతరం నిందితులు నగదుతో పాటు బాధితుడి ద్విచక్ర వాహనాన్ని (TS 08 HN 8582) ఎత్తుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం నిందితులు చాదర్‌ఘాట్, నింబోలిఅడ్డ మీదుగా కాచిగూడ వరకు వెళ్లి, అక్కడ వాహనాన్ని వదిలి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల కళ్లుగప్పేందుకు నిందితులు తమ దుస్తులను మార్చుకుని, కాచిగూడ ఎక్స్ రోడ్స్ వైపు కాలినడకన పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టమైంది.
ఈ ఘటనపై సుల్తాన్‌బజార్ పోలీసులు పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ (FIR No. 28/2026) నమోదు చేశారు. గాయపడిన వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్, నిందితులను వేగంగా పట్టుకోవడానికి ప్రత్యేక క్రైమ్ టీమ్‌లను రంగంలోకి దించింది. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ, పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసిన పోలీసులు, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి అనుమానిత సమాచారం ఉన్నా వెంటనే ‘డయల్ 100 ‘కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.



