
ఖమ్మం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 38 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియా తండా ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి 38 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
స్థానికులు, ఎంఈవో డి.అబ్రహం తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో వడ్డించిన అన్నం, సాంబారు, కోడిగుడ్డు తిన్న కొద్దిసేపటికే చిన్నారులు కడుపునొప్పితో వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.
38 మంది విద్యార్థులను స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, హెచ్ఎం మురళీకృష్ణ, టీచర్ వెంకటేశ్వరరావు వెంటనే విద్యార్థులను ఆటోల్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వీరిలో తీవ్రంగా వాంతులు చేసుకున్న 20 మందిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఆస్పత్రికి చేరుకుని చిన్నారులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
అలాగే మాజీ ఎమ్మెల్యే బాణోతు చంద్రావతి, ఆర్డీవో నరసింహారావు, డీఎం హెచ్‌ఓ డాక్టర్ రామారావు, డీఈఓ చైతన్య జైనీ తదితర అధికారులు ఆస్పత్రిని సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బాధితుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆస్పత్రి పరిసరాల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.



