
లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రసంగంపై రగడ.. మైక్ కట్ చేసిన స్పీకర్
లోక్‌సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కింద చర్చ జరుగుతున్న సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ డోక్లాం అంశాన్ని ప్రస్తావించారు.ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఒక ప్రచురితమైన మ్యాగజైన్ కథనంలోని అంశాలతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
దీంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాహుల్ గాంధీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సభలో లేని వ్యక్తుల గురించి- ధృవీకరించని పత్రికా కథనాలను ఆధారం చేసుకుని మాట్లాడటం సభా నిబంధనలకు విరుద్ధమని రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇటువంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఈ సందర్భంగా రాహుల గాంధీని రక్షణ మంత్రి మందలించారు.
తన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పష్టీకరణ అంతకు ముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ ఎంపీలు.. నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది.
అనంతరం స్పీకర్ కలుగ చేసుకోవడంతో ఎన్డీయే సభ్యులు వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరాలకు రాహుల్ గాంధీ బదులిస్తూ.. తన వద్ద ఉన్న సమాచారం అత్యంత ప్రామాణికమైనదని స్పష్టం చేశారు.
తాను ప్రస్తావిస్తున్న అంశాలు ఒక మాజీ ఆర్మీ జనరల్ ఇంకా ప్రచురించని జ్ఞాపకాలు , నోట్స్‌లోనివని ఆయన సభకు తెలిపారు. సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు, ప్రభుత్వం చెబుతున్న విషయాలకు పొంతన లేదని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.
గతంలోనూ చైనా సరిహద్దు వివాదాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ సింగ్ ఖండించిన నేపథ్యంలో, నేటి సభలో మాజీ ఆర్మీ అధికారుల ప్రస్తావన రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.




