KhammamPoliticalTelangana

గురుకుల ప్రతిష్టను నిలబెట్టే బాధ్యత విద్యార్థులదే: ఎంఈఓ నాగిరెడ్డి

గురుకుల ప్రతిష్టను నిలబెట్టే బాధ్యత విద్యార్థులదే: ఎంఈఓ నాగిరెడ్డి

విద్య ఉన్న చోటే గౌరవం నిలుస్తుంది

గురుకుల ప్రతిష్టను నిలబెట్టే బాధ్యత విద్యార్థులదే: ఎంఈఓ నాగిరెడ్డి

సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 05 2026: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఏన్కూరు గురుకుల పాఠశాల కళాశాల ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) పి. నాగిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గురుకుల పాఠశాలలో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి విద్యలోనే ఉందని తెలిపారు. విద్య కేవలం ఉద్యోగావకాశాలకే పరిమితం కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, సమాజానికి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడానికి దోహదపడాలని అన్నారు. విలువలతో కూడిన శాస్త్రీయ విద్యను అందిపుచ్చుకోవడం ద్వారా విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో నిలబడాలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం విద్యార్థుల్లో తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
గురుకుల విద్యా వ్యవస్థ విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి కలిగించే విధంగా రూపొందించబడిందని ఆయన వివరించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని కోరారు. పాఠశాలలో పొందిన విద్య, గురువుల మార్గదర్శనం జీవితాంతం ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధేశించుకొని వాటిని సాధించడానికి నిరంతరం శ్రమించాలని సూచించారు.
తహసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గురువులు అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని గౌరవించి జీవితంలో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ వేము రాజు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి సంస్థకు మరింత పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులు గతంలో సాధించిన విజయాలను గుర్తుచేస్తూ, ఈ సంవత్సరం విద్యార్థులు కూడా అదే స్థాయిలో ప్రతిభ కనబరచాలని కోరారు. విద్యార్థులు సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని, ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ చదువులో రాణించాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల పాఠశాలలో పొందిన విద్య, క్రమశిక్షణ తమ జీవితానికి బలమైన పునాది వేసిందని చెప్పారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ భావోద్వేగంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ఏటీపీ శ్రీనివాస్, డిప్యూటీ వార్డెన్ అంజాద్ పాషా, సీనియర్ ఉపాధ్యాయురాలు ఎం. లక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button