
లక్ష్యసాధనకు విద్యార్థులు కష్టపడాలి: ప్రిన్సిపాల్ వేము రాజు
విద్యతో పాటు విలువలు అవసరం…గురుకులంలో వీడ్కోలు సభ
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 05 2026: విలువలతో కూడిన శాస్త్రీయ విద్య ఎంతో అవసరమని ఏన్కూరు గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ వేము రాజు పేర్కొన్నారు.
గురువారం గురుకుల పాఠశాల కళాశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేము రాజు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, సమాజపట్ల బాధ్యతాభావం విద్యార్థుల్లో ఉండాలని సూచించారు. లక్ష్యసాధన కోసం విద్యార్థులు కష్టపడి శ్రమించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
గురుకులంలో నేర్చుకున్న మంచి విలువలు, నైతికత జీవితాంతం విద్యార్థులకు దారి చూపుతాయని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురుకులంలో విద్యార్థులతో గడిపిన సమయం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకొని గురుకులానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు గురుకులంలో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ వ్యక్తిత్వ వికాసానికి గురుకుల విద్య ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు.
గురుకులాన్ని, స్నేహితులను విడిచి వెళ్లడం బాధాకరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సంకల్పించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు.
పాటలు, నృత్యాలు, వినోద కార్యక్రమాలు నిర్వహించి సభలో ఆనందోత్సాహాలు నింపారు. జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో ఏటీపీ శ్రీనివాస్, డిప్యూటీ వార్డెన్ అంజాద్ పాషా, సీనియర్ ఉపాధ్యాయులు ఎం. లక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి భవిష్యత్తులో విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.



