
ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన జగన్ ఫెక్సీలకు ఆయన అభిమానులు చేతులు కోసుకుని రక్త తిలకం దిద్దారు.
అలాగే బైట్ స్టంట్లతోపాటు ‘జై జగన్, సీఎం సీఎం జగన్’ అంటూ పెద్దఎత్తున నిదానాలు చేశారు. వారిని నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారి ప్రయత్నాలను ఆపే క్రమంలో.. జగన్ అభిమానులు గుంపులు గుంపులుగా పోలీసుల మీదకు దూసుకెళ్లారు.
దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు జోగి రమేశ్‌తోపాటు పలువురు నేతలు అక్కడే ఉన్న అభిమానులను కట్టడి చేయకపోవడం గమనార్హం.
ఇంకోవైపు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వద్ద జగన్ కాన్వాయ్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన అంబులెన్సు ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు పట్టించుకోలేదు.
దాదాపు అరగంటపాటు కాన్వాయ్‌లోనే అంబులెన్స్ ఇరుక్కుపోవడంతో.. రోగితోపాటు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో రోగి బంధువులు స్వయంగా రంగంలోకి దిగి.. ట్రాఫిక్‌కు క్లియర్ చేసి అంబులెన్స్ ముందుకు వెళ్లేలా మార్గం సుగమం చేశారు.
వైసీపీ శ్రేణుల వ్యవహారశైలిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్ కారణంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ను ఈ రోజు వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకు భారీ కాన్వాయ్‌తో వైఎస్ జగన్ బయలుదేరారు.




