
సికే న్యూస్ కథనంతో కదిలిన వైద్య యంత్రాంగం
– ఏన్కూరులో వైద్య సేవలపై జిల్లా అధికారుల సమీక్ష
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 06 2026: సికే న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) సందర్శించి వైద్య సేవల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనాలకోట రామారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్ బాబు కలిసి శుక్రవారం ఏన్కూరు పీహెచ్‌సీని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న చికిత్స విధానం, డాక్టర్లు మరియు సిబ్బంది హాజరు, మందుల అందుబాటు, రోగుల నమోదు విధానం వంటి అంశాలను అధికారులు సవివరంగా పరిశీలించారు.
ఫార్మసీ విభాగాన్ని తనిఖీ చేసి అవసరమైన మందులు తగిన మోతాదులో నిల్వ ఉంచాలని సూచించారు. ల్యాబ్ రికార్డులను పరిశీలించిన అధికారులు రోగులకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు సమయానికి నిర్వహించి నివేదికలను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం వైద్య సిబ్బంది ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఎంపీడీవో భాగ్యశ్రీ, ఎంఫీఓ జీవీఎస్ నారాయణను కలిసి మండలంలో అమలు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దోమల నివారణ చర్యలు, డ్రైనేజ్ వ్యవస్థల నిర్వహణను క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఏన్కూరు ఆరోగ్య ఉపకేంద్రాన్ని కూడా అధికారులు సందర్శించారు.
మెయిన్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ బ్లాక్ కావడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం అధికారుల దృష్టికి రావడంతో వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని ఎంపీడీవోకు సూచించారు.
పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భూక్య రాములు, పీడీఎంఓ డాక్టర్ సాయి లాస్య, ల్యాబ్ టెక్నీషియన్ రమణ, హెల్త్ ఎడ్యుకేటర్ వేణుగోపాల్, పీహెచ్‌ఎన్ పుణ్యవతి మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు చేసిన సూచనలను త్వరితగతిన అమలు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.




