
సీపీఎం నుంచి తమ్మినేని సోదరుడి సస్పెన్షన్
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడైన తమ్మినేని కోటేశ్వరరావుపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినందుకు ఆయనను బహిష్కరిస్తున్నట్లు సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
తమ్మినేని స్వగ్రామం తెల్దారుపల్లి.. ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనమైంది. తెల్దారుపల్లి పరిధిలోకి వచ్చే 15వ వార్డులో కోటేశ్వరరావు భార్య విజయలక్ష్మి సీపీఎం అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోటేశ్వరరావు తన భార్యతో నామినేషన్‌ను ఉపసంహరింపజేయడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ కు సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారాన్ని సీరియ్‌సగా తీసుకున్న పార్టీ నాయకత్వం.. విజయలక్ష్మి నామినేషన్ ఉపసంహరణ పూర్తిగా వ్యక్తిగతమని, అది పార్టీ నిర్ణయం మేరకు జరగలేదని స్పష్టం చేస్తూ అప్పుడే ఒక ప్రకటన విడుదల చేసింది.
అనంతరం క్రమశిక్షణ చర్యల కింద కోటేశ్వరరావును సస్పెండ్ చేసింది. పలు సందర్భాల్లో ఆయనపై అంతర్గతంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా మార్పు రాలేదని, పార్టీ నిర్ణయాలను, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేశారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన మంగతాయి దివంగత కాంగ్రెస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య భార్య. కృష్ణయ్య 2022 ఆగస్టు 15న హత్యకు గురవగా..
ఆ కేసులో ఆయనకు వరుసకు సోదరుడైన కోటేశ్వరరావు కూడా నిందితుడిగా ఉన్నారు. పలు ఘటనలతో పాటు కృష్ణయ్య హత్య తర్వాత తమ్మినేని కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో గ్రామంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని గ్రహించిన కొందరు పెద్దలు చేసిన సూచనలతో కోటేశ్వరరావు తన భార్య విజయలక్ష్మితో నామినేషన్‌ను ఉపసంహరింపజేశారని వార్తలొచ్చాయి.
తమ్మినేని కుటుంబాల మధ్య సయోధ్య కుదరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నా.. సీపీఎం అభ్యర్థి, ఆమె భర్త సొంత నిర్ణయంతో బరి నుంచి తప్పుకొన్నారంటూ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.



