
పోటీలో భార్య.. భర్తపై సస్పెన్షన్ వేటు..
ప్రచారంలో పాల్గొనకపోయినా కానిస్టేబుల్‌పై చర్యలు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయం ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రెండో వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కానిస్టేబుల్ రమేశ్ భార్య గీతాంజలి పోటీచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొమురవెల్లి ఠాణాలో పనిచేస్తున్నారు.
గీతాంజలి నామినేషన్ వేసినప్పటి నుంచి కానిస్టేబుల్ రమేశ్ ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. అయినప్పటికీ శనివారం రాత్రి పోలీసు అధికారులు వచ్చి రమేశ్‌కు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశారు.
‘సార్ నాకు ఆరోగ్యం బాగా లేదు. రెండు రోజులుగా దవాఖానలో ఉన్నా. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎందుకు సస్పెండ్ చేశారు?’ అని ఇంటికి వచ్చిన పోలీసులను అడిగారు.
దవాఖానలో పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను సైతం చూపించి కన్నీళ్లు పెట్టుకున్నారు. వారు ఏ మాత్రం వినకుండా ఉత్తర్వులు అందజేసి అతని సంతకం తీసుకొని వెళ్లిపోయారు.
ఈ ఘటనతో రమేశ్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు చిన్నారులు రాత్రి ఏడుస్తూనే ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు రమేశ్‌తోపాటు గీతాంజలికి ధైర్యం చెప్పారు.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
చేర్యాలలోని రెండో వార్డులో ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు కలిసి కుట్ర పన్ని తన భర్తను సస్పెండ్ చేయించారని కానిస్టేబుల్ భార్య, బీఆర్‌ఎస్ వార్డు అభ్యర్థి గీతాంజలి ఆరోపించారు.
ప్రజలకు సేవ చేయాలనే కోరికతో తాను రాజకీయాల్లో వచ్చానని, తనను ఇబ్బందులకు గురిచేస్తున్న వారికి ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
భర్తకు జరిగిన ఆన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వార్డు ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడంతో పాటు అక్కడే బైఠాయించి నిరసన తెలిపింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై పోటీకి దిగిన అధికార కాంగ్రెస్ మహిళా అభ్యర్థి భర్త సంజీవులు ఇలాంటి ఘటనలకు దిగుతున్నాడని ఆరోపించారు.
ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి వారి మన్ననలు పొందాలి కానీ తమను అణచివేసేందుకు నామినేషన్లు వేసినప్పటి నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తన భర్తను విధుల్లోకి తీసుకోవాలని, ఆయనకు ఎన్నికలతో సంబంధం లేదని ఆమె పోలీస్ అధికారులను వేడుకున్నారు.



