
ఇందిరమ్మ ఇళ్ల కూల్చివేత.. కన్నీటి పర్యంతమైన లబ్ధిదారులు
Web desc : ఇందిరమ్మ ఇళ్ల కూల్చివేత..ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్ ప్రాంతంలో పేదలు కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎందుకు కూలగొడుతున్నామో చెప్పకుండా కూల్చి వేయడంపై స్థానికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు .స్థానిక 27వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా సుమారు 400మంది కూలీ పనులు చేసుకుని జీవించే నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి 58 జీవో కింద ప్రభుత్వం నుండి పట్టాలు మంజూరు చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు.
ఎటువంటి సమాచారం లేకుండా కూల్చివేత..
మొదటి విడతగా రూ. లక్ష రూపాయలు విడుదల చేసింది. అనంతరం కొంత కాలం నిర్మాణం ఆపాలని అధికారులు లబ్ధిదారులకు చెప్పారు. తర్వాత మరలా కట్టుకోవాలని చెప్పడంతో వారు అప్పులు తెచ్చి తిరిగి ప్రారంభించారు.
అయితే తాజాగా మరో కొద్ది రోజుల్లో స్లాబ్ పూర్తవుతున్న ఇళ్లను ఎటువంటి సమాచారం లేకుండా అధికారులు కూల్చివేశారు. సంఘటన స్థలాన్ని సీపీఎం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.కే.సైదులు సందర్శించి జరిగిన సంఘటన వివరాలు బాధితులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ అడ్డులేని ప్రభుత్వం పట్టా ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ తమ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు.



