
మృత్యుదారిగా మారిన భద్రాచలం, చర్ల రహదారి
భద్రాచలం నుంచి చర్ల ప్రధాన రహదారి మరోసారి ప్రాణాన్ని బలిగొంది. లక్ష్మీనగరం వద్ద జరిగిన బుధవారం జరిగిన ఘటనలో చర్ల మండలంలోని సుబ్బంపేట పంచాయతీ పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన కొట్టెం కమల అక్కడికక్కడే మృతి చెందింది.
క్షణాల్లో జరిగిన ఈ ఘటన ఒక కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం కమల బైక్ పై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ద్విచక్ర వాహనం ములకపాడు సెంటర్ ప్రధాన రహదారి వద్ద గుంతలో స్లిప్పై ఆమె కిందపడింది.
అదే సమయంలో ఎదురుగా వస్తున్న సిమెంటు లోడు లారీ అదుపులోకి రాక ఆమె పైనుంచి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు.
తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనను కళ్లారా చూసిన వారు షాక్‌కు గురయ్యారు. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు పరిస్థితులు, అధిక వేగంతో వెళ్తున్న భారీ ఇసుక లారీలు, భారీ వాహనాలు, ట్రాఫిక్ నియంత్రణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఇంకెంతమంది ప్రాణాలు పోతే అధికారులు మేల్కొంటారు? అని ప్రశ్నిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిసింది. కమల మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.




