
కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి…
ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ముచ్చింతల్ గ్రామానికి చెందిన ఎం.డి. సుల్తానా కుమార్తె ఎం.డి.సనా (16) శంషాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
బుధవారం కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన సనా రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించింది. అర్ధరాత్రి సమయంలో ఆమె తల్లిని నిద్రలేపి కడుపు నొప్పిగా ఉందని చెప్పింది.
కొద్దిసేపటి తర్వాత నొప్పి తగ్గిందని మళ్లీ పడుకుంది. తెల్లవారుజామున మళ్లీ తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు వెంటనే బంధువుల ఆటోలో శంషాబాద్‌లోని లిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్ల సూచన మేరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి సనా మృతిచెందినట్లు నిర్ధారించారు. సుల్తానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



