
మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…
ఫోన్ పేలో లంచాలు తీసుకుంటున్న విద్యుత్ అధికారులు
TGSPDCLలో పలువురు ఇంజనీర్ల పై సస్పెన్షన్ వేటు
మొత్తం 8 మంది ADE, AE, సబ్ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు
వివిధ అంశాల్లో ఫోన్ పే వంటి డిజిటల్ మార్గాల్లో లంచాలు తీసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి
ఇంజనీర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇటీవల పెద్ద ఎత్తున సంస్థలకు వ్యతిరేకంగా ధర్నా చేయడంతోనే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటున్న ఉద్యోగ సంఘాలు
మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలోని దుండిగల్‌లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ(గురువారం) సోదాలు నిర్వహించారు. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తుల వ్యవహారంపై విచారణ చేపట్టారు.
మున్సిపల్ కార్యాలయం మొత్తం పనితీరుపై ఆడిట్, టెక్నికల్ విభాగంతో సహా సంబంధిత విభాగాలు సహాయం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మున్సిపల్ కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లపై లంచాల ఆరోపణలు వెల్లువెత్తాయి.
టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వాట్సాప్ చాట్‌లో ఈ వ్యవహారం బయటపడింది. సూపర్‌వైజర్ భర్త కంపెనీకి అనధికారికంగా నిధులు మళ్లించినట్లు గుర్తించారు.
సోదాలు జరిగే సమయంలో ఒక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఐదుగురు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది గైర్హాజరైనట్లు తెలిపారు. SFAS ద్వారా పారిశుధ్య కార్మికుల హాజరు రికార్డులను తారుమారు చేసినట్లు గుర్తించారు.
49 భవనాల నిర్మాణాలకు కావాల్సిన అనుమతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 21 రోజుల పరిమితికి మించి 12 ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
అలాగే, 32 అనధికార నిర్మాణ కేసుల్లో 28 కేసుల్లో రెండవ నోటీసులు జారీ చేయకపోవడం, G+5 అనధికార భవనాలకు G+3 అనుమతిని అక్రమంగా మంజూరు చేసినట్లు గుర్తించారు. అధికారులపై వచ్చిన ఆరోపణలతో వారి ఖాతాల బ్యాంక్ స్టేట్‌మెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు.
ఈ సోదాల్లో కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లు, ఫైల్ నోట్స్, డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై అవసరమైన చర్యలకు సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.



