
కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. KPHB పద్మావతి ప్లాజాలో తగలబడిన మొబైల్ షాప్
కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేపీహెచ్బీ కాలనీలోని పద్మావతి ప్లాజా కమర్షిఎల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని మొబైల్ షాపులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఫోన్ల దుకాణం పూర్తిగా కాలిపోయింది.
శనివారం (ఫిబ్రవరి 21) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో ఫోన్స్ దుకాణం పూర్తిగా తగలబడిపోయింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు షాపంతా వ్యాపించాయి. కాంప్లెక్స్ అంతా దట్టమైన పొగలతో భయానక పరిస్థితులు కనిపించాయి.
వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
షాప్ లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీ ఎత్తున ఎగసి పడుతుండటంతో కాంప్లెక్ లో లాడ్జి లో ఉన్నవారు, స్థానికులు పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న మిగతా షాపు నిర్వాహకులు వారి షాపులలో ఏదైనా ప్రమాదం జరిగి ఉండవచ్చునని కంప్లెక్స్ కు చేరుకున్నారు.
మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఫైర్ అధికారులు. ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయా అని పక్కపక్కన ఉన్న షాపులను తనిఖీ చేశారు.



