
వైద్యం వికటించడంతో వెంటిలేటర్ పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతి
Web desc : ఉప్పల్ టీఎక్స్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించడంతో వెంటిలేటర్ పై శిరీష (23) అనే యువతిని ఉంచారు.
వెంటిలేటర్ తీస్తే ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని బ్రతకడానికి 2% మాత్రమే ఛాన్సు ఉందని వైద్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పెద్ద పహాడ్ గ్రామానికి చెందిన శిరీష కడుపు నొప్పితో 2025 డిసెంబర్ 31 ఉప్పల్ టీఎక్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.
పేగుకు ఇన్ఫెక్షన్ ఉందని, సర్జరీ చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. దీంతో 2026 జనవరి 4న ఉప్పల్ టీఎక్స్ హాస్పిటల్ లో శిరీషకు లాపరోస్కోపిక్ సర్జరీ చేశారు. అనంతరం చెకప్ ల కోసం టీఎక్స్ హాస్పిటల్ కు ప్రతి వారం వెళ్లారు శిరీష.
సర్జరీ అయి, సుమారు రెండు నెలలు అయింది. ఈ తరుణంలోనే రూ. 20 లక్షల వరకు హాస్పిటల్ కు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయినా శిరీషకు సమస్య తగ్గక పోవడంతో టిఎక్స్ హాస్పిటల్ వైద్యులను కుటుంబ సభ్యులు నిలదీశారు. శిరీషకు మళ్ళీ సర్జరీ చేయాలని తెలిపారు వైద్యులు. దీంతో రెండు రోజుల క్రితం లాపరోస్కోపిక్ సర్జరీ చేశారు టీఎక్స్ వైద్యులు.
ఇక ఈ సర్జరీ విఫలమై శిరీష వెంటిలేటర్ పై ఉన్నారు. పెళ్లైన నాలుగు నెలలకే శిరీష పరిస్థితి ఇలా కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
టీఎక్స్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే శిరీషకు ఈ పరిస్థితి వచ్చిందని హాస్పిటల్ ముందు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి పై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వెంటిలేటర్ పై ఉన్న శిరీషకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తామని టీఎక్స్ హాస్పిటల్ యాజమాన్యం హామీ ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.



