
సునీల్ నాయక్‌పై లుకవుట్ నోటీసులు
Web desc : నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌కుమార్ నాయక్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు.
బిహార్ కేడర్‌కు చెందిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయక్ తన డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుని బిహార్ వెళ్లిపోయారు.
రఘురామరాజును గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారించిన గదిలో ఆయన కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు అనేక దఫాలు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోగా.. పట్నా హైకోర్టును ఆశ్రయించారు.
ఆ హైకోర్టు నుంచి తీసుకున్న ప్రొటెక్షన్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ వేయడంతో సునీల్ నాయక్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని గుంటూరులోని రెండోఅదనపు జూనియర్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల కోర్టు దానిని కొట్టివేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేయడానికి మూడ్రోజుల కిందట దర్యాప్తు అధికారి అయిన విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం పట్నాకు వెళ్లింది. అరెస్టు సమయంలో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది.
ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సునీల్ నాయక్‌ను బిహార్ పోలీసులు విడిపించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఆయన్ను అరెస్టు చేయడానికి పట్నా వెళ్లిన పోలీసు బృందం అక్కడే మకాం వేసింది. నాయక్‌పై నాన్‌బెయిలబుల్ వారెంటు జారీచేయాలని పోలీసులు మంగళవారం గుంటూరులోని మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై బుధవారం తీర్పు ఇస్తానని ప్రకటించిన న్యాయాధికారి స్రవంతి.. దానిని గురువారానికి వాయిదావేశారు. మరోవైపు.. పోలీసులు బుధవారం కోర్టులో సెర్చ్ వారెంటు దాఖలు చేశారు. దీనిపైనా గురువారం న్యాయస్థానం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
గడచిన మూడ్రోజులుగా సునీల్ నాయక్ అరెస్టు విషయంలో ఏపీ, బిహార్ రాష్ర్టాల పోలీసుల మధ్య నెలకొన్న పరిస్థితులు వివాదాస్పదంగా మారాయి. అరెస్టు నుంచి మినహాయింపు పొందడానికి నాయక్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. పట్నా హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు.
తాజాగా ఆ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిగి తీర్పు రావడానికి కనీసం వారం పడుతుందని భావిస్తున్నారు. ఈలోగా గుంటూరు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంటుపై నిర్ణయం ప్రకటిస్తే నాయక్ అరెస్టుకు పోలీసులు వేగంగా కదిలే వీలుంది.
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై లుకవుట్ నోటీసులు జారీ చేశారు.



