
నకిలీ డాక్టర్లు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!
Web desc : అర్హతలుండవు.. అనుమతులుండవు.. వసతులు చక్కగా ఉండవు.. కానీ వైద్యం చేసి జేబులు నింపుకుంటారు. అడిగేవారు లేక వారి ఆటలకు అదుపు లేకుండా ఏళ్ల తరబడి నకిలీ డాక్టర్‌ల పేరుతో వైద్యం చేస్తూ వైద్య రంగానికి మాయని మచ్చగా మారారు. సరిగ్గా అలాంటి సంఘటనతో మిర్యాలగూడ సంచలనంగా మారింది.
వైద్యం అంటే జేబులు నింపుకోవడమే తప్ప సేవలు కాదు అన్న చందంగా మారుతుంది. వైద్యాన్ని వ్యాపారంగా చేసుకొని పేద ప్రజల అనారోగ్య సమస్యలను క్యాష్ చేసుకుంటున్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించే రోజులు పోయి కాసుల ఉంటేనే వైద్యం అనే పరిస్థితి నెలకొంది.
ఒకవైపు నకిలీ వైద్యులు మరో వైపు అర్హత లేని వైద్యులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.మిర్యాలగూడ లో నకిలీ డాక్టర్ ల అరెస్ట్‌తో వైద్యరంగం ఉలిక్కిపడినట్లు అయింది.
అంతా దోపిడే.. మిర్యాలగూడ పట్టణం వైద్యపరంగా వ్యాపార కేంద్రంగా మారిందనడంలో సందేహం లేదు.మిర్యాలగూడ లో సుమారు వందల సంఖ్యలో ఆస్పత్రులు ,మెడికల్ దుకాణాలున్నాయి.
అయితే పట్టణంలో ప్రతి రోజు కోట్ల రూపాయాల వైద్య వ్యాపారం జరుగుతుందని అంచనా. పేరుకు మల్టీ స్పెషాలిటీ పేర్లతో ఆస్పత్రులు నిర్వహిస్తున్న నిర్వహకులు బిల్లుల రూపంలో లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్నారని తెలిసింది.
సేవలు, వసతులు నామ మాత్రంగా ఉన్న ఫీజులు, పరీక్షల పేరుతో భారీగా బిల్లులు వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని ఆస్పత్రులలో పరీక్షలు వద్ద , ల్యాబ్ వద్ద ,స్కానింగ్ వద్ద అర్హత కలిగిన వారు కాకుండా అక్కడ పని నేర్చుకునే వారితో చేయిస్తున్నారని పలు విమర్శలు ఉన్నాయి.
మరికొందరు క్లినిక్ లు ,డయాగ్నస్టిక్ ల పేరుతో ఇరుకు భవనాల లో ప్రత్యేక వైద్యులతో వైద్య సేవలు అందించి రోగులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తనిఖీలు లేకపోవడం వలన ఆసుపత్రి యాజమానులు ఆడిందే ఆటగా సాగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు .
నకిలీ డాక్టర్ల అరెస్ట్‌తో కలకలం.. మిర్యాలగూడలో అర్హత లేకున్న కంటి హాస్పిటల్ నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ పంపారు.
వీరు చేసిన వైద్యం వలన కంటి చూపు కోల్పోయిన బాధితురాలి ఫిర్యాదుతో గత ఏడాది డిసెంబర్ 20 న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీ చేసి పలు ఆస్పత్రులలో అర్హత లేని వారు వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు ఐదుగురు నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. దీంతో మిర్యాలగూడ లో ఇలాంటి వైద్యం చేసే వారు ఇతర ఆస్పత్రుల్లో కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. అర్హతలు లేని నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డబ్బే లక్ష్యంగా అమాయక ప్రజలను నమ్మించి వైద్య సేవల పేరుతో కొంతమంది డాక్టర్లు దండుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు.
నకిలీ వైద్యుల ఆస్పత్రులకు జిల్లా వైద్యాధికారులు , ఇటు మున్సిపాలిటీ అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వ అధికారులు అన్ని ఆస్పత్రులను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




