
అధికారి… అడ్డదారి!
కాంట్రాక్టు ఉద్యోగం పేరిట రూ.16.56 లక్షలు స్వాహా
మండల విద్యాశాఖలో ఆయనో ముఖ్య అధికారి. ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే నిబంధనలు ఉల్లంఘించారు. 2014లో మధిర మండల వనరుల కేంద్రానికి సర్వశిక్ష అభియాన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన మెసెంజర్ పోస్టు మంజూరైంది.
నెలకు రూ.11,050 వేతనం. తన సతీమణినే మెసెంజర్ ఉద్యోగినిగా చూపుతూ నాటి నుంచి సదరు విద్యాధికారి రూ.లక్షలు పక్కదారి పట్టించారు.
విధులు నిర్వర్తించకుండానే సతీమణి పేరుతో 12ఏళ్లుగా రూ.16.56 లక్షల వేతనం డ్రా చేశారు. ఇటీవల ఓ విశ్రాంత ఉద్యోగి.. డీఈఓ, విద్యాశాఖ వరంగల్ ఆర్‌జేడీ కార్యాలయంలో ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగుచూసింది.
అన్నీ ఉల్లంఘనలే..
1. కాంట్రాక్టు పద్ధతిలో పోస్టును భర్తీ చేసేందుకు నిబంధనలున్నాయి. స్థానిక నిరుద్యోగుల్లో ప్రతిభ ఆధారంగా అర్హులను ఎంపిక చేయాలి. ఈ నిబంధనేం పాటించని సదరు విద్యాధికారి ఎలాంటి సమాచారం లేకుండా, తన సతీమణి పేరునే ఖరారు చేశారు.
2. ఉద్యోగులకు సంబంధించి బిల్లులను ట్రెజరీ కార్యాలయంలో సమర్పించటం మెసెంజర్ విధి. సదరు ఉద్యోగిని ఇంతవరకూ ఈ బాధ్యత నిర్వర్తించలేదు. ఎంఆర్‌సీ కార్యాలయంలో ఆమె పనిచేస్తున్నారనే విషయం అక్కడి సిబ్బందిలోనే చాలామందికి తెలియదు. కార్యాలయంలో కనిపించకున్నా ప్రతినెలా వేతనం మాత్రం పొందటం గమనార్హం.
3. ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను విద్యాశాఖలో కొన్ని నెలల క్రితం అందుబాటులో తెచ్చారు. ఇప్పటి వరకు ఆమె హాజరు నమోదుకాలేదు. సదరు ఉద్యోగిని ఫోన్ నంబర్ వివరాలూ అందులో లేవు.
4. మధిర నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇటీవల ఓ పార్టీ తరఫున పోటీ చేసి ఆమె కౌన్సిలర్‌గా గెలిచారు. ఈ విషయంపై మధిర ఎంఈఓ ప్రభాకర్‌ను వివరణ కోరగా.. అధికారి భార్య అయితే ఉద్యోగం చేయకూడదా, అర్హత లేదా అని ప్రశ్నించారు. మూడు నెలల క్రితమే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారని పేర్కొనగా గత నెలాఖరు వరకు వేతనం తీసుకోవటం గమనార్హం.
ఫిర్యాదు అందింది
చైతన్యజైని, డీఈఓ
మధిర విద్యాధికారిపై ఫిర్యాదు అందిన మాట వాస్తవమే. పరిశీలించి విచారణ జరుపుతాం.




