
ఆనంద నిలయం హాస్టల్ లో విషాదం..
Web desc : విద్యార్థులకు పరీక్షల ఫీవర్ పట్టుకుంది. పోటీ ప్రపంచంలో ఒత్తిడికి గురవుతున్నారు. పదో తరగతి పరీక్షలు ఇంకో కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. గ్రాండ్ టెస్టుకు హాజరు కావాల్సిన పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆనంద నిలయం (హాస్టల్)లో ఆవరణలో పదో తరగతి విద్యార్థి హాస్టల్ ఆవరణలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాద ఘటన విద్యార్థులను కన్నీటిసంద్రంలో ముంచేసింది.”పదో తరగతి పాస్ అయితే చాలు. నా తలారి ఉద్యోగం నీకు వస్తుందను కొన్నా కొడుకా” అని విద్యార్థి బీసీ సామాజికవర్గానికి చెందిన తండ్రి తలారి ఓబులేసు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.”ఈ సంఘటనపై విచారణ చేస్తున్నా.
ఉదయమే నేను కడప నుంచి ప్రొద్దుటూరుకు చేరుకున్నా అని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కొమ్మడి సరస్వతి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన తలారీ ఓబులేసు కొడుకు నరసింహులు పదో తరగతి చదువుతున్నాడు. ప్రొద్దుటూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్ (ఆనంద నిలయం)లో ఉంటున్నాడు.
ఆదివారం రాత్రి విద్యార్థులతో ఆనందంగా మాట్లాడుతూ గడిపాడు. పొద్దుపోయింది ఇక పడుకుందాం అని సహచర విద్యార్థులు కోరారు. వాచ్ మన్ కూడా అదే మాట చెప్పాడని సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి వివరించారు. రాత్రి 12 గంటల తరువాత అందరూ నిద్రలోకి జారుకున్నారు.
“హాస్టల్ ఆవరణలో ఒంటరిగా తిరుగుతున్న నరసింహులు మాత్రం తెలియని వేదన, ఒత్తిడికి గురైనట్లు” తెలుస్తోంది. సోమవారం ఉదయం హాస్టల్ భవనం వద్ద నిచ్చెన పక్కకు తీద్దాం అని వెళ్లిన వాచ్ మన్ కు చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతున్న నరసింహులు మృతదేహం కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే వార్డన్ బ్రహ్మాంనందరెడ్డి హాస్టల్ వద్దకు చేరుకున్నారు. “సమాచారం తెలియగానే ప్రొద్దుటూరు హాస్టల్ లో విచారణ చేస్తున్నా” అని కడప జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి చెప్పారు. తల్లిదండ్రులతో చివరి’సారీ’
ప్రొద్దులూరు ఎస్సీ హాస్టల్ లో 17 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వారిలో నరసింహులు ఒకరు. వారికి సోమవారం నుంచి గ్రాండ్ టెస్టు (ముందస్తు పరీక్షలు) ప్రారంభం కానున్నాయి. ఆదివారం సెలవుకావడం వల్ల నరసింహులు జమ్మలమడుగులోని ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులతో హాయిగా గడిపాడు. వారితో కలిసి భోజనం చేశాడు.
“ఆదివారం సాయంత్రం నరసింహులు తండ్రి తలారి ఓబులేసు, పెనానాన్న ప్రొద్దుటూరులోని హాస్టల్ లో వదిలి వెళ్లారు” అని తమ విచారణలో చెప్పారని సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి చెప్పారు.
“జీవితం ముగించాలని ముందుగానే నిర్ణయించుకున్న నరసింహులు చనిపోయవడానికి ముందు తల్లిదండ్రులను కడసారి చూసి వచ్చాడు” అని హాస్టల్ సిబ్బందితో పాటు నరసింహులు తండ్రి ఓబులేసు కూడా కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం తెలియగానే కన్నీటి వేదనతలో నరసింహులు తండ్రి ఓబులేసు, కుటుంబీకులు ప్రొద్దుటూరు హాస్టల్ వద్దకు చేరుకున్నారు.
“పదో తరగతి అయినా పాస్ అయితే తలారి ఉద్యోగం అయినా ఇప్పిద్దామని అనుకున్నా. ఎంత ఘోరం జరిగింది కొడకా? మా ఆశలు తీరకుండానే వెళ్లిపోయావా” అని నరసింహులు తండ్రి హాస్టల్ వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హాస్టల్ ను పరిశీలించారు.
ఆత్మహత్యకు పాల్పడిన నరసింహులు మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ లో పరిస్థితులపై పూర్తిగా విచారణ చేసి, నివేదిక సమర్పిస్తానని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి చెప్పారు.



