BhadrachalamPoliticalTelangana

భద్రాచలం వైపు రేపల్లెవాడ భక్త బృందం

భద్రాచలం వైపు రేపల్లెవాడ భక్త బృందం

భద్రాచలం వైపు రేపల్లెవాడ భక్త బృందం

గోటి తలంబ్రాలతో భక్తుల కాలినడక యాత్ర

శ్రీరామ నామస్మరణతో ముందుకు సాగుతున్న రేపల్లెవాడ భక్త బృందం

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 02 2026: మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన ఆంజనేయ స్వామి భక్త బృందం భక్తిశ్రద్ధలతో గోటి తలంబ్రాలు తీసుకుని పవిత్రక్షేత్రం భద్రాచలం దేవస్థానంకు కాలినడకన బయలుదేరారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం సుమారు 50 మంది భక్తులు ఘనంగా యాత్రను ప్రారంభించారు.
భక్త బృందం గత నెల రోజులుగా ప్రతిరోజూ సమిష్టిగా చేరి గోటితో తలంబ్రాలు వలిచినట్లు తెలిపారు. ఈ తలంబ్రాలను అత్యంత పవిత్రంగా భావిస్తూ, భక్తి నిబద్ధతలతో సిద్ధం చేశారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కలిసి భక్తి గీతాలు పాడుతూ తలంబ్రాల తయారీలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
యాత్ర ప్రారంభ వేళ గ్రామస్తులు భక్తులకు హారతులు ఇచ్చి, పూలదండలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు గ్రామస్తులు యాత్రికులకు నీరు, పండ్లు అందజేస్తూ సహకరించారు. భక్తులు శ్రీరామ నామస్మరణతో, జై శ్రీరామ్ నినాదాలతో ముందుకు సాగారు. మార్గమధ్యంలోని దేవాలయాల్లో ఆగి స్వామివారిని దర్శించుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.
భద్రాచలంలో నిర్వహించే తలంబ్రాలు కలిపే కార్యక్రమంలో ఈ భక్త బృందం పాల్గొననుంది. అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామివారికి గోటి తలంబ్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వారు వెల్లడించారు. తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సు, గ్రామాభివృద్ధి, ప్రజల క్షేమం కోసం ఈ యాత్రను చేపట్టినట్లు భక్తులు పేర్కొన్నారు.
గ్రామ ప్రజలు భక్తుల యాత్ర సాఫల్యవంతంగా పూర్తవాలని, వారు సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని ప్రార్థించారు. రేపల్లెవాడ గ్రామం నుంచి భక్తుల సమిష్టి కాలినడక యాత్ర గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button