
వణుకు పుట్టిస్తున్న ‘ఎస్టీ’ అస్త్రం..
ఖమ్మం అధికారుల మెడపై జాతీయ కమిషన్ కత్తి!
“వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వకపోతే ఢిల్లీకి ఈడ్చుకెళ్తాం”..
అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హుస్సేన్ నాయక్ వార్నింగ్.
కుర్చీలు కదులుతాయి.. జైలు ఊచలు లెక్కపెడతారు!
రెవెన్యూ యంత్రాంగంపై జాతీయ ఎస్టీ కమిషన్ సింహగర్జన.
కమిషన్ వస్తే ముఖం చాటేస్తారా?
బరితెగించిన అధికారుల భరతం పట్టనున్న కేంద్ర ప్యానెల్.
సస్పెన్షన్లు ఖాయం.. అట్రాసిటీ కేసులు తథ్యం!
బిక్కుబిక్కుమంటున్న అధికార యంత్రాంగం.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన బాధితుల కన్నీటి ఉప్పెన ఎట్టకేలకు ఢిల్లీ పీఠాన్ని తాకింది. దశాబ్దాలుగా సొంత జాగల కోసం పోరాడుతున్న పేదల ఆర్తనాదాలు విన్న జాతీయ ఎస్టీ కమిషన్.. ఖమ్మం అధికార యంత్రాంగంపై ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడింది. బాధితుల కడగండ్లు స్వయంగా తెలుసుకునేందుకు వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ రాకతో.. స్థానిక అధికారుల బండారం బట్టబయలైంది. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న జాతీయ స్థాయి బాధ్యుడు వస్తే, కనీస సమాచారం ఇవ్వకుండా, అందుబాటులో లేకుండా పోయిన రెవెన్యూ అధికారుల తీరుపై ఎస్టీ కమిషన్ నిప్పులు చెరిగింది. బరితెగించిన అధికారుల వెన్నులో వణుకు పుట్టేలా, కుర్చీలు కదిలిపోయేలా హుస్సేన్ నాయక్ చేసిన సింహగర్జన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
దాక్కుంటే వదిలేస్తామా?.. అధికారులపై కన్నెర్రజేసిన కమిషన్
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన రెవెన్యూ యంత్రాంగం కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్న తీరును జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. చంటి పిల్లలకు పాలు కూడా దొరకని దీనస్థితిలో బాధితులు విలవిలలాడుతుంటే, కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన అధికారుల తీరుపై హుస్సేన్ నాయక్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజల పన్నుల మీద జీతాలు తీసుకుంటూ వారికి కష్టం వస్తే ముఖం చాటేస్తారా అని, కమిషన్ వస్తే దాక్కుంటారా అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేదల ఉసురు పోసుకుంటున్న ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వెలుగుమట్లలో జరిగిన అక్రమాలు, బాధితులకు జరిగిన అన్యాయంపై వారం రోజుల్లోగా సమగ్రమైన, వాస్తవిక నివేదికను తమ టేబుల్ మీద ఉంచాలని అల్టిమేటం జారీ చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, తప్పుడు నివేదికలు ఇచ్చి బుకాయించాలని చూసినా కఠిన చర్యలు తప్పవని ఖబడ్దార్ అంటూ గట్టిగా హెచ్చరించారు.
ఢిల్లీకి లాక్కెళ్లి భరతం పడతాం.. వణికిపోతున్న యంత్రాంగం
ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోలేదని, వారం రోజుల్లో కచ్చితమైన సమాధానం రాకపోతే అధికారులను ఢిల్లీకి ఈడ్చుకెళ్తామని హుస్సేన్ నాయక్ చేసిన హెచ్చరికలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడ బోనులో నిలబెట్టి అధికారుల బండారం బయటపెడతామని స్పష్టం చేయడంతో బి తహసీల్దార్ల నుంచి మొదలుపెట్టి.. కలెక్టరేట్ లోని ఉన్నతాధికారుల వరకు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడపటం ఖాయం అవుతుంది. దశాబ్దాలుగా సాగుతున్న భూదాన భూముల బాగోతంలో ఎవరెవరి పాత్ర ఉందో అన్నీ బయటకు లాగుతామని కమిషన్ తేల్చి చెప్పడంతో, భూదాన బోర్డు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు తీవ్ర భయం పట్టుకుంది. నిన్నటి దాకా రాజాలా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడుతాయో అని బిక్కుబిక్కుమంటున్నారు.
ఎస్టీ కమిషన్ కొరడా ఝుళిపిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి!
జాతీయ ఎస్టీ కమిషన్ హెచ్చరికలను ఎందుకు లైట్ తీసుకోకూడదు, అసలు కమిషన్ రంగంలోకి దిగితే అధికారుల పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలు ఉంటాయి. ఈ అధికారాలను ఉపయోగించి ఏ అధికారినైనా, దేశంలోని ఏ మూల నుంచైనా ఢిల్లీకి పిలిపించి విచారించే అత్యున్నత అధికారం, సమన్లు జారీ చేసే సత్తా కమిషన్‌కు ఉంది. హుస్సేన్ నాయక్ విధించిన వారం రోజుల గడువులోగా అధికారుల నివేదిక రాకపోయినా, లేదా వారు ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. బాధితుల పట్ల పక్షపాతంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని రుజువైతే.. తక్షణమే సంబంధిత అధికారులపై ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం’ కింద నాన్-బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిషన్ నేరుగా పోలీసులను ఆదేశిస్తుంది.
అంతేకాకుండా, విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణ సస్పెన్షన్ వేటు వేయాలని, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర డీవోపీటీ కి కమిషన్ గట్టిగా సిఫార్సు చేస్తుంది. కమిషన్ చేసిన ఇలాంటి సిఫార్సులను బుట్టదాఖలు చేసే సాహసం ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయదు. ఒకవేళ కమిషన్ సీరియస్ అయ్యి సదరు అధికారులను ఢిల్లీలో విచారణకు పిలిపిస్తే, ఆ వ్యవహారం వారి సర్వీస్ రికార్డుల్లో తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుంది. దీని వల్ల వారికి భవిష్యత్తులో రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవడమే కాకుండా, పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ ప్రయోజనాలపై కూడా ఊహించని స్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుంది. అవసరమైతే కటకటాల వెనక్కి నెట్టి జైలు పాలు చేసేంత భయంకరమైన పరిణామాలు అధికారులను వెంటాడుతాయి.
కంటిమీద కునుకులేని ఖమ్మం అధికారులు
ఎస్టీ కమిషన్ తదుపరి తీసుకోబోయే యాక్షన్ తో ఖమ్మం అధికార యంత్రాంగంలో మునుపెన్నడూ చూడని ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది. వారం రోజుల గడువులో ఏ క్షణాన ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందో, ఏ క్షణాన తమపై సస్పెన్షన్ వేటు పడుతుందోనని అధికారులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోవడం తప్పదు. ఇప్పటివరకు ఫైళ్లను తొక్కిపెట్టి, పేదలను అరిగోస పెట్టిన వారంతా ఇప్పుడు తమ ఉద్యోగాలను ఎలా కాపాడుకోవాలో తెలియక న్యాయ నిపుణులను, పైస్థాయి అధికారులను ఆశ్రయించక తప్పదు. ఏది ఏమైనా, వెలుగుమట్ల బాధితుల కన్నీటికి జాతీయ ఎస్టీ కమిషన్ రూపంలో న్యాయం జరిగే సమయం ఆసన్నమైందని, తప్పు చేసిన అధికారుల కుర్చీలు కదలడం ఖాయమని సర్వత్రా విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.




