
పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్న ఉన్నతాధికారులు : బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా కలెక్టర్, డీసీపీ నుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారంటూ ఉన్నతాధికారులపై బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బాల్క సుమన్ విడుదలయ్యారు. అనంతరం ఆయన క్యాతనపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
ఆ తర్వాత బాల్క సుమాన్ విలేకర్లతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ సమయంలో ఘర్షణకు కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రయత్నం చేసిన తమపై అక్రమ కేసులు పెట్టించారని విమర్శించారు.
సమావేశం లోపల మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు రామకృష్ణపూర్ పోలీసులు తన ఇంట్లో సోదాలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఘర్షణతో సంబంధం లేని నేతలందరినీ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీపైన కేసు పెట్టారని గుర్తు చేశారు. అంతేకాదు.. జైలులో తనను తీవ్ర ఇబ్బంది పెట్టారని తెలిపారు.
కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు, ఆరోగ్యం బాగా లేకున్నా పట్టించు కోలేదని చెప్పారు. తమపై తీవ్ర ఆంక్షలు విధించారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పును ఇప్పటికైనా గౌరవించాలంటూ సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి వివేక్‌కు ఆయన సూచించారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనంతరం కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి కారణమైన కాంగ్రెస్ నేతలపైనా కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించిన కేసులో ఫిబ్రవరి 18వ తేదీన బాల్క సుమన్‌తోపాటు ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హజరుపరిచారు.
కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో నాటి నుంచి వారంతా జైలులో ఉన్నారు. వీరికి మంచిర్యాల, చెన్నూరు కోర్టుల్లో బెయిల్ లభించింది. ఈ రోజు అంటే.. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి వారు విడుదలయ్యారు.



