
మంత్రి వివేక్‌కు ‘ఐ లవ్ యూ’ అంటూ బాల్క సుమన్ చమత్కారం
క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి వివేక్ కారు పై దాడి కేసులో అరెస్టై, పక్షం రోజుల పాటు ఆదిలాబాద్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ బెయిల్‌పై విడుదలయ్యారు.
ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. క్యాతనపల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారని, అయితే 16న జరగాల్సిన చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడిందని తెలిపారు.
17న కోరం ఉన్నప్పటికీ కేవలం కౌన్సిలర్ల ప్రమాణస్వీకారమే నిర్వహించారని, చైర్మన్ ఎన్నికను ఎందుకు వాయిదా వేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ రోజు జరిగిన ఘటనల సీసీ ఫుటేజ్‌ను ప్రజలకు విడుదల చేయాలని ఎన్నికల కమిషనర్‌ను కోరారు.
బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ బబ్బేర స్వర్ణలతను లోపలికి అనుమతించలేదని, దీంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీతో కలిసి రోడ్డుపై బైఠాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలే మొదట దాడి చేశారని, అయితే వారిపై కేసులు నమోదు కాలేదని ఆరోపించారు.
జిల్లాలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. జైలులో ఉన్న సమయంలో కనీస సదుపాయాలు కల్పించలేదని, మూడు రోజుల పాటు దుప్పటి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి సీసీ ఫుటేజ్‌ను రెగ్యులర్‌గా మానిటర్ చేసిన మంత్రి వివేక్‌కు ‘ఐ లవ్ యూ’ అంటూ చమత్కరించారు. వారెంట్ లేకుండా తన ఇంట్లో సోదాలు జరిపిన రామకృష్ణాపూర్ ఎస్సై శ్రీధర్‌పై కూడా మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఉన్నవారికే చైర్మన్ పదవి దక్కాలని, క్యాతనపల్లిలో 22 వార్డుల్లో 14 వార్డులు బీఆర్ఎస్-సీపీఐ గెలిచినప్పటికీ, 8 వార్డులు గెలిచిన కాంగ్రెస్ చైర్మన్ పదవిని ఎలా పొందుతుందని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, డీసీపీ ప్రభుత్వానికే కాక ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వ్యవహరించి చైర్మన్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ, బీఆర్ఎస్-సీపీఐ పొత్తులో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ముందే అవగాహన కుదిరిందని చెప్పారు. ప్రజల కోసం జైలుకు వెళ్లిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, రామగుండం బీఆర్ఎస్ ఇంచార్జ్ కౌశిక్ హరి, జెడ్పీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, సీపీఐ జిల్లా అధ్యక్షుడు కలవవేణి శంకర్, ఇతర పార్టీ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



