
ఖమ్మంలో అధునాతన ‘ప్రెస్ క్లబ్’ నిర్మించుకుందాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
డబ్ల్యూజేఐ వినతికి రాష్ట్ర మంత్రి పొంగులేటి సానుకూల స్పందన
నియోజక వర్గ కేంద్రాల్లో ‘ఇందిరమ్మ మోడల్ హౌస్’ లను ప్రెస్ క్లబ్బులకు ఇవ్వాలని డబ్ల్యూజేఐ సూచన
ఖమ్మం జిల్లా ‘అక్రిడేషన్ కమిటీ’లో డబ్ల్యూజేఐ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్రిడేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కొన్ని నిబంధనలను మార్చాలని విన్నపం
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన ‘ప్రెస్ క్లబ్’ నిర్మించుకుందామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఉదయం ఖమ్మంలోని తన నివాసంలో మంత్రి పొంగులేటిని కలిసిన వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కో కన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, అమరనేని రామకృష్ణ, ఖమ్మం నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు బొడ్డుపల్లి రవీందర్ తదితరులు, జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మరియు నియోజక వర్గ కేంద్రాల్లో అధునాతన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని, ఖమ్మం జిల్లా అక్రిడేషన్ కమిటీలో ‘డబ్ల్యూజేఐ’ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని, అక్రిడేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన కొన్ని నిబంధనలను మార్చాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మంలో అధునాతన ‘ప్రెస్ క్లబ్’ నిర్మించుకుందామన్నారు.
అంతకు ముందు, ఇప్పుడున్న ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల అవసరాలకు ఏ మాత్రం సరి పోవడం లేదని, అక్కడ కనీసం పార్కింగ్ స్థలం కూడా లేదని, ఎక్కువ మంది కూర్చోవడానికి ఇబ్బందిగా వుందని డబ్ల్యూజేఐ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. కొత్త ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించి, అధునాతన భవనం నిర్మించాలని కోరారు.
అలాగే, అన్ని నియోజక వర్గ కేంద్రాల్లోనూ స్థలాలను కేటాయించి, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాలను చేపట్టాలని, వీటి నిర్మాణాలు పూర్తి అయ్యే వరకూ తాత్కాలికంగా నియోజక వర్గాల్లో నిరుపయోగంగా వున్న వున్న ప్రభుత్వ భవనాలను కేటాయించాలని కోరారు. అవకాశం వున్న చోట ఇందిరమ్మ మోడల్ హౌసులను ప్రెస్ క్లబ్బుల నిర్వహణకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
• ఖమ్మం జిల్లా ‘అక్రిడేషన్ కమిటీ’లో ప్రాతినిధ్యం కల్పించండి
‘వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులకు ఖమ్మం జిల్లా ‘అక్రిడేషన్ కమిటీ’లో స్థానం కల్పించాలని మంత్రి పొంగులేటిని యూనియన్ ప్రతినిధులు కోరారు.
ఇది 2017లో ట్రేడ్ యూనియన్ యాక్టు క్రింద నమోదు చేయబడిన సంస్థని, ‘భారతీయ మజ్దూర్ సంఘ్’కు అనుబంధంగా పని చేస్తుందని చెప్పారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సంఘానికి అక్రిడేషన్ కమిటీల్లో ప్రాతినిధ్యం దొరక లేదని తెలిపారు.
తమ యూనియన్ ప్రతినిధులకు కూడా ఖమ్మం జిల్లా ‘అక్రిడేషన్ కమిటీ’లో స్థానం కల్పించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ‘డబ్ల్యూజేఐ’ ప్రతినిధులకు కూడా ‘అక్రిడేషన్ కమిటీ’లో స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
• అక్రిడేషన్ కార్డుల జారీలో ఇబ్బందికరమైన నిబంధనలను మార్చండి
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ‘ది తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025’లో కొన్ని అంశాలు జిల్లాల్లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ‘అక్రిడేషన్ కార్డులు’ పొందడంలో ఇబ్బందిగా మారాయని ‘డబ్ల్యూజేఐ’ ప్రతినిధులు మంత్రి పొంగులేటి దృష్టికి తెచ్చారు.
ఈ సారి 2,000 నుండి 15, 000 వరకు సర్క్యులేషన్ వున్న పత్రికలకు (చిన్న పత్రికలు) అసలు జిల్లా కేంద్రంలో అక్రిడేషన్ కార్డులే ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 15,000 నుండి 25, 000 వరకు సర్క్యులేషన్ వున్న పత్రికలకు ఒక్క జర్నలిస్టుకు మాత్రమే కార్డు(మండలం) ఇస్తున్నారని, ఫోటో గ్రాఫర్ కు కూడా లేదని తెలిపారు.
అలాగే, 25,000 నుండి 75, 000 వరకు సర్క్యులేషన్ వున్న పత్రికలకు సహితం జిల్లా కేంద్రంలో ఒక జర్నలిస్ట్, ఒక ఫోటో గ్రాఫర్, ఒక మండల జర్నలిస్ట్ కు మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారని, ఒక వేళ జిల్లా కేంద్రంలో పత్రికను ముద్రిస్తే, ఒక కార్డు ఆధనంగా ఇస్తున్నారని వివరించారు.
ఇవి ఆయా పత్రికల్లో పని చేస్తున్న ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులకు ఏ మాత్రం సరిపోనందున, ప్రతి కేటగిరీలో కార్డులు పెంచాలని, జిల్లా కేంద్రాల్లో పని చేసే క్రైమ్, స్పొర్ట్స్, కల్చరల్, ఎడ్యుకేషన్ జర్నలిస్టులకు కూడా రాష్ట్ర స్థాయిలో ఇచ్చినట్లు ‘అక్రిడేషన్ కార్డులు’ ఇవ్వాలని, పని చేస్తున్న డెస్క్, వెబ్ సైట్, ఫ్రీలాన్స్, కేబుల్ టీవీ జర్నలిస్టులందరికీ కార్డులు మంజూరు చేయాలని ‘డబ్ల్యూజేఐ’ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.



