
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి పురుగుల మందు తాగిన భర్త….
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
తిరుమలాయపాలెం: కిడ్నీ సంబంధిత సమస్యతో నరకయాతన పడుతున్న ఓ వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు.
కానీ కుటుంబంలో విషాదం నింపొద్దని అడ్డు తగలడమే ఆయన భార్యకు శాపమైంది.
ఈక్రమంలో సదరు వ్యక్తి భార్యపై పెట్రోల్ పోసి మంట అంటించాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
ఎస్సై జగదీశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం(65) రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.
ఈ సందర్భంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది.
నానాటికీ సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను ముందు చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కాగా, నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.
వీరి కుమారుడు మండల కేంద్రంలోనే మరోచోట ఉంటున్నాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చి భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.



