
వ్యవసాయ డ్రోన్లపై 40% సబ్సిడీ
మహిళా సమాఖ్య సమావేశంలో పథకాలపై అవగాహన
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 07 2026: ఏన్కూరు మండల మహిళా సమాఖ్య సమావేశం కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హాజరయ్యారు.
ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఏ. నరసింహారావు పాల్గొని రైతులకు మరియు మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ – SMAM (Sub Mission on Agricultural Mechanization) పథకం ద్వారా రైతులకు మరియు సంఘాలకు 40 శాతం సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల్లో ఉపయోగించడం ద్వారా పంటలపై మందులు పిచికారీ చేయడం, ఎరువులు చల్లడం వంటి పనులు తక్కువ సమయంలో సులభంగా చేయవచ్చని చెప్పారు.
ఈ పథకానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ పిఓ లు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పిఎసిఎస్), మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులని వివరించారు. ఆసక్తి ఉన్న సంఘ సభ్యులు మరియు రైతులు మరిన్ని వివరాల కోసం వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పథకాలపై వివరాలు తెలుసుకున్నారు. అధికారులు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను ఉపయోగించుకొని వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.




