
పొదుపు సంఘాలకు లోన్ ఇచ్చేందుకు లంచం… కూకట్పల్లిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ..
పొదుపు సంఘాలకు లోన్లు ఇచ్చి స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సంస్థలో అవినీతి చోటుచేసుకుంది. అధికారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
పట్టణ పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి.. పేదల నుంచి లంచం వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. మంగళవారం (మార్చి 10) హైదరాబాద్ కూకట్ పల్లిలో ఏసీబీ అధికారుల దాడిలో.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు కమ్యూనిటీ ఆర్గనైజర్.
కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలోని మూసాపేట్ సర్కిల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించారు. మూసాపేట్ సర్కిల్లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (UCD) విభాగంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా పని చేస్తున్న మురళిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ప్రభుత్వం నుంచి పొదుపు సంఘాలకు వచ్చే రుణాలకు సంబంధించి ఓ గ్రూపు నుంచి లంచం తీసుకుండగా అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. యూసీడీ పరిధిలో ఓ గ్రూపుకు 20 లక్షల రూపాయల లోన్ ను మంజూరు చేసేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరికి 18 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఒప్పందం ప్రకారం మంగళవారం డబ్బులు చెల్లించాల్సిందిగా సూచించాడు. అధికారి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ముందుగానే ఏసీబీని ఆశ్రయించిన బాధితులు.. అధికారులు చెప్పినట్లుగా డబ్బులు చెల్లించారు.
ప్లాన్ ప్రకారం నిందితుడు డబ్బులు తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గ ఆ పట్టుకున్నారు. 18 వేల రూపాయల లంచంతో పట్టుబడటంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.



