
బీసీ గురుకులంలో ఫుడ్‌పాయిజన్
మణుగూరులో 15 మంది విద్యార్థినులకు అస్వస్థత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీసీ గురుకుల బాలికల వసతిగృహంలో ఆహారం కలుషితమై 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. మణుగూరు వసతిగృహంలో మొత్తం 270మంది విద్యార్థినులు, 21మంది సిబ్బంది ఉన్నారు.
ఆదివారం రాత్రి హాస్టల్‌లో విద్యార్థినులు భోజనం చేసి పడుకున్నారు. సోమవారం ఉదయం 7వ తరగతి విద్యార్థినులు హర్షిత (సత్తుపల్లి), రిషిత (పాల్వంచ), బేబీ భవ్యశ్రీ (సందుల రామాపురం), జలజ (మణుగూరు) ఈ నలుగురు కడుపునొప్పితోపాటు వాంతులై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వారిని మణుగూరు వంద పడకల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సాయంత్రం మరో 11మంది విద్యార్థినులకు కడుపునొప్పితోపాటు వాంతులు కావడంతో హాస్టల్ సిబ్బంది వారిని కూడా మణుగూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
విషయం తెలుసుకున్న డీసీవో బ్యూలా రాణి హాస్టల్‌ను సందర్శించి అస్వస్థతకు గల కారణాలు విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్‌లో వండిన భోజనం తినడం వల్లనే ఫుడ్‌పాయిజన్ అయిందని విద్యార్థినులు చెబుతుండగా, బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నారని టీచర్లు ఆరోపించారు.
డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు విద్యార్థినులకు వైద్యసేవలు అందించేందుకు వచ్చిన భద్రాచలం వైద్యసిబ్బందిని సైతం హాస్టల్ సిబ్బంది లోనికి అనుమతించకుండా గంటసేపు బయట నిలబెట్టడం గమనార్హం.
ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగానే ఉందని, రాత్రి తీసుకున్న భోజనం ఫుడ్‌పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విద్యార్థినులను పరామర్శించేందుకు గురుకుల వసతిగృహానికి రాగా అక్కడున్న సిబ్బంది ఆయనను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన మణుగూరు దవాఖానకు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ అద్దంకి నరేశ్ సైతం విద్యార్థినులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.




