
కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు బిగ్ రిలీఫ్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాల్లేవని.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు.
దానం నాగేందర్, కడియం శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా వీరు పని చేస్తున్నారని.. వీరి శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు(బుధవారం) విచారణ చేపట్టారు. ఈ విచారణలో తాము ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామని, పార్టీ మారలేదని దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
దానం, కడియం వాంగ్మూలాలను (statements) పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. వీరిద్దరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అనర్హత వేటు పిటిషన్లను కొట్టేశారు.
దీంతో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఊరట లభించినట్లయ్యింది. ఇదిలాఉంటే.. రేపు (గురువారం) సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై విచారణ జరగనుంది.
ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసు మళ్లీ విచారణకు వచ్చేలోగా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు వెలువరించారు.
దానం నాగేందర్ ఏమన్నారంటే..
స్పీకర్ తనపై అనర్హత వేటు వేసినా పోరాటం ఆపనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏరోజు పనిచేయలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనకు ఎప్పుడూ విప్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ పరిధిలో తాను ఎక్కడా పోరపాటు చేయలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.
అనర్హత పిటిషన్ కొట్టివేతపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పై అనర్హత పిటిషన్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
ఈ అంశంపై బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను వివరణ అడగలేదని దానం వెల్లడించారు.
పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా వివరణ అడగలేదన్నారు. నాపై పిటిషన్ వేసిన వాళ్లకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. నాకు ఎప్పుడూ విప్ జారీ చేయలేదని, పార్టీకి వ్యతిరేకంగా నేను పనిచేయలేదని దానం అన్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు ఇచ్చారు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారినట్లు మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. తాజాగా దానం, కడియం శ్రీహరికి క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు.




