
నాలాలో పడ్డ బాలుడు.. కొంచెమైతే ప్రాణాలే పోయేవి..!
సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు..
హైదరాబాద్ పాతబస్తీలో ఓ బాలుడికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు నాలాలో పడ్డ బాలుడు స్థానికుల అలర్ట్‌తో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఓల్డ్ మలక్‌పేట్ పరిధిలోని కాగజ్‌నగర్ ప్రాంతంలో GHMC అధికారులు కొన్నాళ్లుగా నాలా నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే.. అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణం అవుతోంది.
ఈ క్రమంలోనే.. నిన్న పెద్ద ప్రమాదం తప్పింది. తవ్వి ఉంచిన నాలాలో ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు పడిపోగా.. స్థానికుల అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
రెహమాన్ అనే ఆరేళ్ల బాలుడు.. తన సోదరితో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే.. అతని చేతిలోని బాల్ నాలాలో పడిపోవడంతో దాన్ని తీసేందుకు వెళ్లి సడెన్‌గా నాలాలో పడిపోయాడు.
బాలుడి సోదరి గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న లక్ష్మణ్ అనే వ్యక్తి వెంటనే స్పందించి నాలాలోకి దూకి బాలుడిని బయటకు తీసుకొచ్చాడు. బాలుడిని సురక్షితంగా కాపాడడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నేత పగిళ్ల నర్సింగ్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నాలా నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై పోలీసులకు, GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు.
జనవరి నుంచి పనులు కొనసాగుతున్నా.. ఇప్పటివరకు పూర్తి చేయకుండా వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం పనులు జరుగుతున్న ప్రదేశంలో భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.
మూడు నెలలుగా నాలా ఓపెన్‌గా వదిలేయడం తీవ్ర నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యమని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా.. పనులు పూర్తి చేసి భద్రతా చర్యలు తీసుకోవాలని కాగజ్‌నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.




