
ప్రజా పాలనలో నిర్లక్ష్యం.. ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు.
ఫరూక్ నగర్ మండలంలోని బూర్గుల పంచాయతీ కార్యదర్శి ఎం.సరోజ, పై అధికారుల అనుమతి లేకుండా సెలవుల్లో వెళ్లడంతోపాటు రికార్డుల నిర్వహణ సరిగా లేని కారణంగా ఆమెను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 9న డిపివో సురేష్ మోహన్, ఫరూక్ నగర్ మండలంలోని కాశి రెడ్డి గూడ, బూర్గుల గ్రామ పంచాయతీలను సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను చేపట్టకుండా నిర్లక్ష్యం కనబర్చి ఆనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన పంచాయతీ కార్యదర్శి కె.వాసవాచారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు మార్గ నిర్దేశం చేయడంలో విఫలమైన మండల పంచాయతీ అధికారి ఎం.జయంత్ రెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేశారు.
కందుకూరు మండలంలోని కందుకూరు, ముచ్చర్ల, కొత్తగూడ గ్రామ పంచాయతీలలోని పారిశుద్ద్య నిర్వహణలో తడి చెత్త-పొడి చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు కె.ఇంద్ర సేనా రెడ్డి, కె.శ్రీహరి, టి.నరేందర్ గౌడ్ లకు షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు డిపివో సురేష్ మోహన్ తెలిపారు.



