
పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. ఎస్‌ఐ బలవన్మరణం
కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ప్రాణసమానమైన భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె మరణించిన ఐదో రోజే ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఐదు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఇల్లంతకుంట మండలం సీతంపేటలోని తన అత్తగారి ఇంట్లో భార్య ఐదో రోజు కార్యక్రమా ముగించుకున్నారు.
అనంతరం డ్రెస్ మార్చుకుంటానని గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో బంధువులకు అనుమానం కలిగింది. గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆయన ఉరివేసుకొని వేలాడుతూ కనిపించారు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.
ఎల్లప్పుడూ విధి నిర్వహణలో చురుగ్గా ఉండే ఎస్సై చంద్రశేఖర్, భార్యపై ఉన్న మమకారంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడటం తోటి సిబ్బందిని, బంధువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



