
శస్త్రచికిత్స వికటించి ఆర్ఎస్ఐ మృతి
సిద్దిపేటలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న తాళ్లపల్లి రాజా సాంబయ్య తొడ కింద భాగంలో చిన్నప్పుడే గడ్డ ఏర్పడింది. దానిని శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఈ నెల ఏడో తేదీన మాదాపూర్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు.
కణితి ఎందుకు ఏర్పడింది బయాప్సీ పరీక్షలు నిర్వహించకుండా, వ్యాధి లక్షణాలు తెలుసుకోకుండా ఆపరేషన్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స అనంతరం రోగిని సాధారణ వార్డులోకి మార్చారు.
రోగి మానసికంగా దృఢంగా ఉన్నాడని జనరల్ వార్డులోకి మారుస్తున్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. మార్చిన అరగంట లోనే ఆపరేషన్ చేసి కుట్లు వేసిన భాగం నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి వైద్యులకు సమాచారం అందించారు.
వెంటనే వైద్యులు రక్తం గడ్డకట్టేలా చేసి తిరిగి ఆపరేషన్ చేసేందుకు ఐసీయూలోకి తరలించారు. ఆపరేషన్ చేసే క్రమంలో జరిగిన తప్పిదంతోనే రోగి కోమాలోకి వెళ్ళిపోయారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధుమేహం, హైబీపీ కారణంగా సమస్య మరింత జటిలమయ్యింది. రోగి కండిషన్ గమనించకుండా వైద్యులు చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణం పోయిందని మృతుని బంధువులు బోరున విలపించారు.
రోజు రోజుకు గడ్డ సైజు పెరుగుతుండడంతో దైనందిన పనులలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆపరేషన్ చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా ప్రాణం పోయే పరిస్థితి వస్తుందని ఊహించలేక పోయామన్నారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈమేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.



