
మా ఎస్.ఐ గారు అందుకే ఆత్మహత్య చేసుకున్నారు: డిఎస్పీ మాధవి
కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ గారు తన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయంపై గత 5 రోజులుగా తీవ్ర మనస్థాపం చెందారనీ, అందువల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సోదరుడు తమకు ఫిర్యాదు చేసినట్లు హుజారాబాద్ డిఎస్పీ మాధవి తెలియజేసారు.
ఎస్సై ఆత్మహత్యకు ఇతర కారణాలు వున్నట్లు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆమె చెప్పారు. కాగా ఐదు రోజుల క్రితం… మంగళవారం నాడు ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు చెట్టు కాయలు కోసుకుని అందులో పప్పును తీసి మెత్తగా దంచి తినేసింది. అవి విషపూరితమైనవి కావడంతో అపస్మారకంలోకి వెళ్లిపోయింది.
దీనితో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగవకపోవడంతో హైదరాబాదుకి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమె కన్నుమూసింది.
ఆమె మరణం వెనుక వున్న కారణాలు ఏమిటో తెలియరాలేదు. కాగా ఆమె ఆత్మహత్య జరిగి 5 రోజులకు ఎస్సై కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. తల్లినీ, తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నారు.



