
ఉద్యోగం రాలేదని యువకుని ఆత్మ*హత్య
Web desc : ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన సిద్ధార్థ(24) డిగ్రీ వరకు చదివాడు. అతడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల అతనికి పెండ్లి కూడా నిశ్చయమైంది. ఉద్యోగం రాకపోవడంతో కొంత కాలంగా మానసిక వేదనను అనుభవిస్తున్నాడు.
ఎక్కడా ఏ ఉద్యోగమూ రాకపోవడంతో సిద్ధార్థ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి రాగా.. తలుపులు పెట్టి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా సిద్ధార్థ ఫ్యాన్‌కి వేలాడుతున్నాడు. వెంటనే తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి అతన్ని కిందకు దించారు.
అప్పటికే అతడు మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



