
ప్రెస్ క్లబ్బా..? ప్రయివేటు క్లబ్బా..?
- అక్రమ వసూళ్లు – లెక్కలపై అనుమానాలు
- తాళాలు కొద్దిమందికే.. ఇతర జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరణ
- కలెక్టర్ తక్షణ విచారణ చేయాలి
- టిడబ్ల్యూజెఎఫ్ (హెచ్-2843) డిమాండ్
Ck news ఖమ్మం, మార్చి 23:
ఖమ్మం ప్రెస్ క్లబ్లో జరుగుతున్న వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. జర్నలిస్టుల ఉమ్మడి వేదికగా ఉండాల్సిన ప్రెస్ క్లబ్‌ను కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని ‘ప్రైవేట్ క్లబ్’లా నడుపుతున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్-2843) జిల్లా కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు టి. సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణలు లోకల్ బాడీస్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సభ్యత్వాల పేరుతో రూ.1000 నుంచి రూ.3000 వరకు ఎటువంటి నిబంధనలు, రశీదులు లేకుండా అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని నేతలు ఆరోపించారు.
ఈ నిధులపై ఎటువంటి లెక్కలు, ఖాతాలు వెల్లడించకపోవడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటివరకు క్లబ్ నిధులపై ఆడిట్ నిర్వహించలేదని, లెక్కలు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ప్రెస్ క్లబ్ తాళాలు కూడా కొద్దిమంది వ్యక్తుల వద్దే ఉండటం, ఇతర జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరించడం, వాట్సాప్ గ్రూపుల్లో ఇతర యూనియన్ ప్రతినిధులకు అడ్మిన్ హక్కులు ఇవ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని టిడబ్ల్యూజెఎఫ్ నేతలు తెలిపారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టులను అడ్డుకోవడం, బెదిరించడం వంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రెస్ స్వేచ్ఛపై నేరుగా దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ తక్షణం జోక్యం చేసుకుని ప్రెస్ క్లబ్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమ వసూళ్లపై ఆడిట్ నిర్వహించి లెక్కలు బహిర్గతం చేయాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ సమాన హక్కులు కల్పించాలని టిడబ్ల్యూజెఎఫ్ (హెచ్-2843) నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, నగర అధ్యక్షులు గెంటేల కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, నాగకృష్ణ, శ్రీధర్, వెలిగొండ వెంకట్, రవి, మొగిలి నాగేశ్వర రావు, ఎం.ఎస్. చిన్ని, మామిడాల వీరబాబు, తానంగి భిక్షం, పాగ యోనా, తిరుపతి కొండలరావు, పి.శ్రీను, సవల బాలరాజు, నీరుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



