
బూర్గంపాడు పంచాయతీలో ‘నిధుల’ సెగ.. మాజీ ఉపసర్పంచ్ ఫిర్యాదుతో ముదిరిన వివాదం!
Web desc : బూర్గంపాడు మండల కేంద్రమైన బూర్గంపాడు గ్రామ పంచాయతీలో నిధుల వినియోగం చుట్టూ ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. గత పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత, ప్రత్యేక అధికారుల పాలనలో జరిగిన ఖర్చులపై అవకతవకలు జరిగాయంటూ మాజీ ఉపసర్పంచ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఈ ఫిర్యాదు అనంతరం గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులు పక్కదారి పట్టించారని, ఎంబీ రికార్డులు లేకుండానే లక్షల రూపాయల బకాయిలు చూపిస్తూ నిధులు డ్రా చేశారని ఆరోపిస్తూ మాజీ ఉపసర్పంచ్ చిప్పా సుధాకర్ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని ‘ప్రజావాణి’లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.
ఫిర్యాదుదారుడిపై వాగ్వాదం.. గ్రామంలో ఉద్రిక్తత
అయితే, ఈ ఫిర్యాదు విషయం తెలియగానే గ్రామంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిర్యాదు చేసిన చిప్పా సుధాకర్‌ను బూర్గంపాడుకు చెందిన పలువురు వ్యక్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు.
పంచాయతీ వ్యవహారాలపై ఫిర్యాదు చేయడం పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ,ఆయనతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలలో చర్చనీయాంశంగా మారాయి.ఈ వాగ్వాదం వెనుక స్థానిక అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అక్రమాలు బయటపడతాయనే భయంతోనే,ఫిర్యాదు చేసిన వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారా? అన్న అనుమానాలు గ్రామస్తుల్లో వ్యక్తమవుతున్నాయి.
నిధుల వినియోగంలో నిజంగానే గోల్‌మాల్ జరిగిందా? లేక రాజకీయ కక్షలతోనే ఈ ఫిర్యాదులు, ఎదురు దాడులు జరుగుతున్నాయా? అన్నది మిస్టరీగా మారింది.
విచారణపైనే అందరి కళ్లు.. మాజీ ఉపసర్పంచ్ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్, దీనిపై విచారణ జరపాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
అధికారుల విచారణలో నిధుల మళ్లింపు నిజమని తేలితే పలువురు అధికారుల, నాయకుల జాతకాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ప్రజల సొమ్ము ఏమైందో నిగ్గు తేల్చాలని బూర్గంపాడు వాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



