
మున్నేరు బ్రిడ్జి వద్ద గిరిజన స్మశాన వాటిక కూల్చివేతపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్!
ఖమ్మం కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ.. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం.
ఖమ్మం, మార్చి 24 : ఖమ్మం రూరల్ పరిధిలోని “బంజారా ధాడి” గిరిజన స్మశాన వాటికను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, మున్నేరు బ్రిడ్జి నిర్మాణం నెపంతో కూల్చివేయడంపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఘటన నేపథ్యం : ఖమ్మం టౌన్ నివాసి మరియు సామాజిక కార్యకర్త దుంగ్రోత్ కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఈ చర్యలు చేపట్టింది.
మున్నేరు బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం గిరిజనుల పూర్వీకుల సమాధులను జెసిబిలతో ధ్వంసం చేశారని, ఇది గిరిజనుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కమిషన్ ఆదేశాలు. : రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A ప్రకారం ఈ అంశాన్ని విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ నోటీసు అందిన 15 రోజుల్లోగా ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు మరియు తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కలెక్టర్ మరియు సిపిని ఆదేశించింది.
నిర్ణీత సమయంలోగా నివేదిక అందకపోతే, సివిల్ కోర్టు అధికారాల ప్రకారం అధికారులకు సమన్లు జారీ చేసి నేరుగా కమిషన్ ముందుకు పిలిపిస్తామని కమిషన్ డైరెక్టర్ డాక్టర్ పి. కళ్యాణ్ రెడ్డి హెచ్చరించారు.
గిరిజనుల హక్కులను కాలరాస్తూ స్మశాన వాటికను కూల్చివేసిన కాంట్రాక్ట్ ఏజెన్సీ మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



